అతను పరిచయస్తుడో
ప్రాణమిత్రుడో తెలియదు
రోజు ఎదురుపడడు
నన్ను పలకరించడు
కానీ
పలకరించిన సమయాన
అతని చూపుల్లోని మృదుత్వం
గదినిండా మల్లెపూలై
పెరడంతా పారిజాతాలై
మదినిండా గులాబీలై
చిరకాల స్నేహంలా
వెంటపడి వేధిస్తుంది
ఓ నిదుర లేని రాతిరి
అతనిలోని మృదుత్వం
మెత్తగా నా చేతుల్లో ఒదిగినట్టు
మేనుపై గంధపు లేపనమైనట్టు
జ్ఞాపకపు బుట్టలో చోటు చేసుకుంటుంది
ఎందుకో
అతను నా కోసం దిగంతాల వరకు వ్యాపించి ఉన్నట్టు
నన్ను అల్లుకున్న బంధమేదో కరిగి నీరవుతునట్టు
గుబులు గుబులుగా మది తల్లడిల్లుతుంది...
అయినా కానీ
మదిపై..రాజరికపు ఆలోచనలు
గుర్రపుస్వారీ చేస్తూనే ఉన్నాయి
అతన్ని పరిచయస్తుడిగా
తిరుగులేని రాజముద్ర వేసింది....